ఆయన కోరిక నా మీద ఉన్నది
పురుషుడు చెప్పులు తొడిగిన ఆమె పాదాల నుండి జుట్టు వరకు ఆమెను పొగడుతాడు, బహిరంగంగా ఆమెలో ఆనందిస్తాడు. ఆమె దాన్ని తప్పించుకోదు. ఆ కోరిక పరస్పరమైనదని, తనది కూడా అని ప్రకటించి, అతని కోసం ఫలాలు దాచి ఉంచిన ద్రాక్షతోటలకు, గ్రామాలకు అతణ్ణి తీసుకువెళ్తుంది.
7 1చెప్పులలో నీ పాదములు ఎంత అందమైనవి, గొప్ప కుమారీ! నీ తొడల వంపులు నగలవలె ఉన్నవి, నిపుణుడైన శిల్పి చేతుల పనివలె ఉన్నవి. 2నీ బొడ్డు కలిపిన ద్రాక్షారసము ఎన్నడూ తగ్గని గుండ్రని పాత్ర. నీ ఉదరము తామరపువ్వులతో చుట్టబడిన గోధుమల కుప్ప. 3నీ రెండు స్తనములు రెండు లేడిపిల్లలవలె, జింక కవలలవలె ఉన్నవి. 4నీ మెడ దంతపు గోపురమువలె ఉన్నది. నీ కన్నులు బత్రబ్బీము ద్వారము దగ్గర హెష్బోనులోని కొలనులవలె ఉన్నవి. నీ ముక్కు దమస్కు వైపు చూచు లెబానోను గోపురమువలె ఉన్నది. 5నీ శిరస్సు కర్మెలువలె నిన్ను కిరీటముగా అలంకరించుచున్నది, నీ జారుచున్న కేశములు ఊదారంగువలె ఉన్నవి; ఒక రాజు వాటి జడలలో బంధింపబడియున్నాడు. 6నా ప్రియురాలా, నీ సమస్త ఆనందములతో నీవు ఎంత అందమైనదానవు, ఎంత మనోహరమైనదానవు! 7నీ దేహాకృతి ఖర్జూరవృక్షమువలె ఉన్నది, నీ స్తనములు దాని గెలలవలె ఉన్నవి. 8నేను, "నేను ఖర్జూరవృక్షమెక్కి దాని ఫలమును పట్టుకొందును" అని అంటిని. నీ స్తనములు ద్రాక్షాతీగె గెలలవలె ఉండునుగాక, నీ ఊపిరి పరిమళము ఆపిల్‌పండ్లవలె ఉండునుగాక, 9నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసమువలె ఉండునుగాక. అది నా ప్రియునికొరకు మృదువుగా ప్రవహించుచు, పెదవులమీదను దంతములమీదను సున్నితముగా జారుచున్నది.
10నేను నా ప్రియునిదానను, ఆయన కోరిక నా మీద ఉన్నది. 11నా ప్రియుడా, రమ్ము, మనము పొలములలోనికి వెళ్లి గ్రామములలో రాత్రి గడుపుదము. 12ప్రొద్దుననే ద్రాక్షతోటలకు వెళ్లి, ద్రాక్షాతీగెలు చిగిర్చెనో, పూమొగ్గలు విచ్చెనో, దానిమ్మలు పూచెనో చూతము. అక్కడ నేను నీకు నా ప్రేమను ఇచ్చెదను. 13పుత్రదాత్రి మొక్కలు తమ పరిమళమును వెదజల్లుచున్నవి, మన ద్వారములమీద క్రొత్తవియు పాతవియునైన శ్రేష్ఠమైన ఫలములన్నియు ఉన్నవి, నా ప్రియుడా, వాటిని నేను నీకొరకు దాచియుంచితిని. a a v13 పుత్రదాత్రి మొక్కలు పరిమళభరిత మొక్కలు; ప్రాచీన లోకములో ఇవి ప్రణయవాంఛను రేకెత్తించి సంతానోత్పత్తిని వృద్ధిచేయునని విస్తారముగా నమ్మబడెను.