సింహమంత ధైర్యము
అధికారమూ ధనమూ కలిసి. తిరుగుబాటు చేసే దేశానికి అధికారులు అనేకులు; దుష్టుడైన అధికారి మీదికి దూకే ఎలుగుబంటి వంటివాడు; దుష్టులు తలెత్తినప్పుడు ప్రజలు దాక్కుంటారు. పాపాలు దాచుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. త్వరగా ధనవంతుడు కావాలనే తొందరే మనిషిని నాశనం చేస్తుందని మళ్లీ మళ్లీ చెబుతుంది.
28 1ఎవరూ తరమకపోయినా దుష్టులు పారిపోతారు, అయితే నీతిమంతులు సింహమంత ధైర్యముగా ఉంటారు. 2దేశము తిరుగుబాటు చేసినప్పుడు దానికి అనేకమంది పాలకులు ఉంటారు, అయితే వివేకము, జ్ఞానము గల మనుష్యుని వలన అది స్థిరముగా నిలుస్తుంది. 3నిస్సహాయులను అణచివేసే బీద మనుష్యుడు ఆహారమేమీ మిగల్చని కుంభవృష్టి వంటివాడు. 4ధర్మశాస్త్రమును విడిచిపెట్టేవారు దుష్టులను పొగుడుతారు, అయితే ధర్మశాస్త్రమును గైకొనేవారు వారికి విరోధముగా పోరాడతారు. 5దుష్టులు న్యాయమును గ్రహించరు, అయితే మన తండ్రిని వెదకువారు దానిని పూర్తిగా గ్రహిస్తారు. 6తన మార్గములలో వంకరగా నడిచే ధనవంతునికంటె యథార్థముగా నడుచుకొను బీదవాడు మేలు. 7ధర్మశాస్త్రమును గైకొనువాడు వివేకముగల కుమారుడు, అయితే తిండిబోతులతో సహవాసము చేయువాడు తన తండ్రికి అవమానము తెస్తాడు. 8వడ్డీ వలనను అన్యాయపు లాభము వలనను తన ఆస్తిని పెంచుకొనువాడు బీదలయెడల ఉదారముగా ఉండువాని కొరకు దానిని కూర్చుకుంటాడు. 9ధర్మశాస్త్రమును ఆలకించుటకు ఎవరైనా నిరాకరిస్తే అతని ప్రార్థన కూడా అసహ్యకరమైనది. 10యథార్థవంతులను దుష్టమార్గములో తప్పిపోవునట్లు నడిపించువాడు తానే తన గోతిలో పడతాడు, అయితే నిర్దోషులు మంచి వస్తువులను స్వాస్థ్యముగా పొందుతారు. 11ధనవంతుడు తన దృష్టికి తాను జ్ఞానవంతుడు, అయితే వివేకముగల బీదవాడు అతనిని పూర్తిగా కనిపెడతాడు. 12నీతిమంతులు జయించినప్పుడు గొప్ప మహిమ కలుగుతుంది, అయితే దుష్టులు లేచినప్పుడు ప్రజలు దాగుకొంటారు. 13తన పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. 14ఎల్లప్పుడు భయభక్తులు కలిగియుండువాడు ధన్యుడు, అయితే తన హృదయమును కఠినపరచుకొనువాడు ఆపదలో పడతాడు. 15నిస్సహాయ ప్రజలపై దుష్ట పాలకుడు గర్జించు సింహము వంటివాడు, దాడిచేయు ఎలుగుబంటి వంటివాడు. 16వివేకము లేని పాలకుడు క్రూరముగా అణచివేయువాడు, అయితే అన్యాయపు లాభమును ద్వేషించువాడు తన దినములను పొడిగించుకుంటాడు. 17రక్తపాతపు దోషభారము మోయు మనుష్యుడు మరణమువరకు పారిపోతూ ఉంటాడు; అతనికి ఎవరూ ఆసరా ఇవ్వకూడదు. 18యథార్థముగా నడుచుకొనువాడు సురక్షితముగా కాపాడబడతాడు, అయితే తన మార్గములలో వంకరగా ఉండువాడు అకస్మాత్తుగా పడిపోతాడు. 19తన భూమిని దున్నువాడు సమృద్ధిగా ఆహారము పొందుతాడు, అయితే వ్యర్థమైన వాటి వెంట పరుగెత్తువాడు సమృద్ధిగా పేదరికమును పొందుతాడు. 20నమ్మకమైన మనుష్యుడు దీవెనలతో నిండి ఉంటాడు, అయితే త్వరగా ధనవంతుడగుటకు తహతహలాడువాడు శిక్ష తప్పించుకోలేడు. 21పక్షపాతము చూపుట మంచిది కాదు, అయినా ఒక రొట్టెముక్క కొరకు మనుష్యుడు తప్పు చేస్తాడు. 22పిసినారి మనుష్యుడు ధనము వెంట తహతహలాడతాడు, పేదరికము తనను ఆవరించునని అతడు ఎరుగడు. 23నాలుకతో ముఖస్తుతి చేయువానికంటె ఒక మనుష్యుని గద్దించువాడు చివరకు ఎక్కువ దయ పొందుతాడు. 24తన తండ్రిని గాని తల్లిని గాని దోచుకొని, "ఇది పాపము కాదు" అని చెప్పువాడు నాశనము చేయువానికి సహవాసి. 25ఆశపోతు మనుష్యుడు కలహమును రేపుతాడు, అయితే మన తండ్రియందు నమ్మకముంచువాడు వర్ధిల్లుతాడు. 26తన స్వహృదయమును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, అయితే జ్ఞానముతో నడుచుకొనువాడు సురక్షితముగా కాపాడబడతాడు. 27బీదలకు ఇచ్చువానికి ఏమీ కొదువ ఉండదు, అయితే వారియెడల తన కన్నులు మూసికొనువాడు అనేక శాపములు పొందుతాడు. 28దుష్టులు లేచినప్పుడు ప్రజలు దాగుకొంటారు, అయితే వారు నశించినప్పుడు నీతిమంతులు వర్ధిల్లుతారు.