ఆయన నామమును స్తుతించండి
రుజువుపై నిర్మించిన స్తుతి. మన తండ్రి సముద్రంలో, ఆకాశంలో తనకు ఇష్టమైనదంతా చేస్తాడు. ఆయన ఐగుప్తును కొట్టాడు, సీహోనును ఓగును పడగొట్టి వారి దేశాన్ని అప్పగించాడు. దానితో పోల్చితే విగ్రహాలకు పనికిరాని నోళ్ళు, కళ్ళు ఉన్నాయి. అవి వాటిని చేసినవారిని కూడా అంతే శూన్యంగా విడిచిపెడతాయి.
135 1హల్లెలూయా! మన తండ్రి నామమును స్తుతించండి; మన తండ్రి సేవకులారా, ఆయనను స్తుతించండి, 2మన తండ్రి మందిరములో సేవచేయువారలారా, మన తండ్రి మందిర ఆవరణములలో సేవచేయువారలారా.
3మన తండ్రిని స్తుతించండి, ఏలయనగా మన తండ్రి దయాళుడు; ఆయన నామమునకు స్తుతిగీతములు పాడండి, ఏలయనగా అది మనోహరమైనది. 4ఏలయనగా మన తండ్రి యాకోబును తనకొరకు ఏర్పరచుకొనెను, ఇశ్రాయేలును తన అమూల్య సొత్తుగా ఏర్పరచుకొనెను.
5ఏలయనగా మన తండ్రి గొప్పవాడని నేనెరుగుదును, మన సర్వాధిపతియైన తండ్రి సమస్త దేవతలకంటె అధికుడని ఎరుగుదును. 6మన తండ్రి తన కిష్టమైనదంతయు ఆకాశములలోను భూమిమీదను, సముద్రములలోను వాటి అగాధములన్నిటిలోను చేసియున్నాడు. 7ఆయన భూమి అంచుల నుండి మేఘములను లేపును; వర్షము కొరకు మెరుపులను కలుగజేయును, తన నిధిగృహముల నుండి గాలిని బయటికి తెచ్చును.
8ఆయన ఐగుప్తు జ్యేష్ఠులను, మనుష్యులను పశువులను కూడ, హతమార్చెను. 9ఐగుప్తూ, ఆయన నీ మధ్యను, ఫరో మీదను అతని సేవకులందరి మీదను, సూచకక్రియలను అద్భుతములను పంపెను. 10ఆయన అనేక జనములను హతమార్చెను, బలవంతులైన రాజులను చంపెను. 11అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును, కనాను రాజ్యములన్నిటిని, 12వారి దేశమును స్వాస్థ్యముగా, తన ప్రజలైన ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించెను.
13మన తండ్రీ, నీ నామము నిత్యము నిలుచును; మన తండ్రీ, నీ కీర్తి తరతరములవరకు నిలుచును. 14ఏలయనగా మన తండ్రి తన ప్రజల న్యాయమును తీర్చును, తన సేవకులయందు కనికరపడును.
15జనముల విగ్రహములు వెండి బంగారములు, మనుష్యుల చేతిపనియే. 16వాటికి నోళ్లు కలవుగాని మాటలాడలేవు; వాటికి కన్నులు కలవుగాని చూడలేవు; 17వాటికి చెవులు కలవుగాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి కూడ లేదు. 18వాటిని చేయువారు వాటివలె అగుదురు, వాటియందు నమ్మకముంచు వారందరును అట్లే.
19ఇశ్రాయేలు వంశమా, మన తండ్రిని సన్నుతించుము; అహరోను వంశమా, మన తండ్రిని సన్నుతించుము; 20లేవీ వంశమా, మన తండ్రిని సన్నుతించుము; మన తండ్రికి భయపడువారలారా, మన తండ్రిని సన్నుతించుము. 21సీయోనులో నుండి మన తండ్రి సన్నుతింపబడునుగాక, ఆయన యెరూషలేములో నివసించువాడు. హల్లెలూయా!