యేసును చంపడానికి నాయకులు కుట్ర పన్నుట
26 1 యేసు ఈ మాటలన్నిటిని చెప్పి ముగించిన తరువాత, ఆయన తన శిష్యులతో ఇట్లనెను, 2 "రెండు దినముల తరువాత పస్కా పండుగ వచ్చుననియు, మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడుననియు మీకు తెలియును."
3 అప్పుడు ప్రధాన యాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని భవనములో సమకూడి, 4 యేసును రహస్యముగా పట్టుకొని చంపవలెనని కలిసి కుట్ర పన్నిరి. 5 అయితే వారు, "పండుగలో వద్దు, లేకున్న ప్రజలలో అల్లరి రేగును" అనిరి.
ఆమె యేసును ఖననము కొరకు అభిషేకించుట
6 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంటిలో ఉన్నప్పుడు, 7 ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు గల చలువరాతి బుడ్డిని తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండియుండగా దానిని ఆయన తలమీద పోసెను. 8 అయితే శిష్యులు దీనిని చూచి కోపగించుకొని, "ఈ నష్టమేల? 9 దీనిని గొప్ప విలువకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునుగదా" అనిరి.
10 యేసు దీనిని తెలిసికొని వారితో, "ఈ స్త్రీని మీరేల తొందరపెట్టుచున్నారు? ఆమె నాకొరకు ఒక మంచి పని చేసెను. 11 బీదలు ఎల్లప్పుడు మీతో ఉందురు, గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండను. 12 ఆమె ఈ అత్తరును నా శరీరముమీద పోసినప్పుడు, నా ఖననము కొరకు నన్ను సిద్ధపరచుటకే దీనిని చేసెను. 13 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఆమె జ్ఞాపకార్థముగా ఆమె చేసిన పనియు చెప్పబడును" అనెను.
యూదా వెండి నాణేలకు కుమారుని అప్పగించుట
14 అప్పుడు పండ్రెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా అనువాడు ప్రధాన యాజకులయొద్దకు వెళ్లి, 15 "నేను ఆయనను మీకు అప్పగించినయెడల మీరు నాకేమి ఇత్తురు?" అని అడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణేలను తూచి అతనికి ఇచ్చిరి. 16 అప్పటినుండి అతడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
పస్కా పండుగకు సిద్ధపడుట
17 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, "నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచవలెనని కోరుచున్నావు?" అని అడిగిరి.
18 ఆయన, "మీరు పట్టణములోనికి ఒక మనుష్యునియొద్దకు వెళ్లి, 'బోధకుడు ఇట్లనుచున్నాడు: నా సమయము సమీపించియున్నది. నేను నా శిష్యులతోకూడ నీ యింటిలో పస్కాను ఆచరించుదును' అని అతనితో చెప్పుడి" అనెను. 19 శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించినట్లు చేసి పస్కాను సిద్ధపరచిరి.
20 సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమందితో భోజనమునకు కూర్చుండెను. 21 వారు భోజనము చేయుచుండగా ఆయన, "నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగించును" అనెను.
22 వారు మిక్కిలి దుఃఖపడి, ఒక్కొక్కడు, "ప్రభువా, అది నేనా?" అని ఆయనను అడుగసాగిరి.
23 అందుకు ఆయన, "నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడే నన్ను అప్పగించును. 24 మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడినట్లే ఆయన వెళ్లుచున్నాడు, గాని ఎవనివలన మనుష్యకుమారుడు అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ! ఆ మనుష్యుడు పుట్టకుండినయెడల అతనికి మేలుగా ఉండెడిది" అనెను.
25 ఆయనను అప్పగించిన యూదా, "రబ్బీ, అది నేనా?" అని అడుగగా, ఆయన అతనితో, "నీవే అంటివి" అనెను.
26 వారు భోజనము చేయుచుండగా, యేసు ఒక రొట్టెను తీసికొని దానిని ఆశీర్వదించి, విరిచి, శిష్యులకిచ్చి, "తీసికొని తినుడి; ఇది నా శరీరము" అనెను. 27 మరియు ఆయన ఒక గిన్నెను తీసికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని వారికిచ్చి, "మీరందరు దీనిలోనిది త్రాగుడి; 28 ఇది నిబంధనకు సంబంధించిన నా రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నది. 29 నేను మీతో చెప్పుచున్నాను, నా తండ్రి రాజ్యములో మీతోకూడ దీనిని క్రొత్తగా త్రాగు దినమువరకు, ఇకమీదట ఈ ద్రాక్షారసమును నేను త్రాగను" అనెను.
30 వారు స్తుతిగీతము పాడిన తరువాత ఒలీవల కొండకు బయలుదేరి వెళ్లిరి.
పేతురు ఎరుగననుటను యేసు ముందుగా చెప్పుట
31 అప్పుడు యేసు వారితో, "ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు. ఎందుకనగా, 'నేను గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, అప్పుడు మంద గొఱ్ఱెలు చెదరిపోవును' అని వ్రాయబడియున్నది. 32 అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లుదును" అనెను.
33 అందుకు పేతురు, "అందరు నీ విషయమై అభ్యంతరపడినను, నేనెన్నడును అభ్యంతరపడను" అని ఆయనతో అనెను.
34 యేసు అతనితో, "నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు" అనెను.
35 పేతురు, "నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పను" అని ఆయనతో అనెను. శిష్యులందరును ఆలాగుననే అనిరి.
కుమారుడు తండ్రికి తనను తాను అప్పగించుకొనుట
36 అప్పుడు యేసు వారితోకూడ గెత్సేమనే అను చోటికి వచ్చి, "నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేయువరకు మీరు ఇక్కడ కూర్చుండుడి" అని శిష్యులతో చెప్పెను. 37 ఆయన పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను తనతోకూడ తీసికొనిపోయి, మిక్కిలి దుఃఖపడి వ్యాకులపడసాగెను. 38 అప్పుడు ఆయన వారితో, "నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ ఉండి నాతోకూడ మెలకువగా ఉండుడి" అనెను.
39 ఆయన కొంచెము దూరము వెళ్లి, సాష్టాంగపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నానుండి తొలగిపోనిమ్ము. అయినను నా చిత్తప్రకారము కాదు, నీ చిత్తప్రకారమే జరుగనిమ్ము" అని ప్రార్థించెను.
40 ఆయన శిష్యులయొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, పేతురుతో, "ఏమీ, మీరు నాతోకూడ ఒక్క గడియైనను మెలకువగా ఉండలేకపోతిరా? 41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము" అనెను.
42 ఆయన మరల రెండవసారి వెళ్లి, "నా తండ్రీ, నేను దీనిని త్రాగకుండ ఇది తొలగిపోజాలనియెడల, నీ చిత్తమే జరుగును గాక" అని ప్రార్థించెను. 43 ఆయన తిరిగి వచ్చి, వారి కన్నులు భారముగా ఉన్నందున వారు నిద్రించుట చూచెను. 44 ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలనే మరల చెప్పుచు మూడవసారి ప్రార్థించెను. 45 అప్పుడు ఆయన శిష్యులయొద్దకు వచ్చి, "మీరింకను నిద్రించి విశ్రాంతి తీసికొనుచున్నారా? ఇదిగో, గడియ వచ్చినది, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. 46 లేచి పోదము! ఇదిగో, నన్ను అప్పగించువాడు వచ్చియున్నాడు" అనెను.
యేసు అప్పగింపబడి బంధింపబడుట
47 ఆయన ఇంకను మాటలాడుచుండగా, పండ్రెండుమందిలో ఒకడైన యూదా వచ్చెను; ప్రధాన యాజకులును ప్రజల పెద్దలును పంపిన గొప్ప జనసమూహము కత్తులతోను గుదియలతోను అతనితోకూడ వచ్చెను. 48 ఆయనను అప్పగించువాడు, "నేను ఎవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే; ఆయనను పట్టుకొనుడి" అని వారికి ఒక సంకేతము ఇచ్చియుండెను. 49 వెంటనే అతడు యేసునొద్దకు వచ్చి, "రబ్బీ, నీకు శుభమగుగాక!" అని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకొనెను.
50 అందుకు యేసు అతనితో, "స్నేహితుడా, నీవు దేనికి వచ్చితివో అది చేయుము" అనెను. అప్పుడు వారు వచ్చి యేసుమీద చేతులు వేసి ఆయనను పట్టుకొనిరి.
51 అంతలో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి తన కత్తిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
52 అప్పుడు యేసు అతనితో, "నీ కత్తిని దాని స్థానములో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొను వారందరును కత్తిచేతనే నశింతురు. 53 నేను నా తండ్రిని వేడుకొనలేననియు, ఆయన పండ్రెండు సైన్యములకంటె ఎక్కువ దూతలను వెంటనే నాయొద్దకు పంపడనియు నీవు తలంచుచున్నావా? 54 అట్లయితే ఇది ఈలాగు జరుగవలెనని చెప్పు లేఖనములు ఏలాగు నెరవేరును?" అనెను.
55 ఆ సమయమున యేసు జనసమూహములతో, "ఒక దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో కూర్చుండి బోధించుచుంటిని, అయినను మీరు నన్ను పట్టుకొనలేదు. 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినది" అనెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
తనపై నేరము మోపువారి ఎదుట యేసు
57 యేసును పట్టుకొనినవారు, శాస్త్రులును పెద్దలును కూడియున్న ప్రధానయాజకుడైన కయపయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. 58 పేతురు దూరమునుండి ప్రధానయాజకుని ఆవరణమువరకు ఆయనను వెంబడించి, లోపలికి వెళ్లి, జరుగబోవునది చూచుటకు బంట్రౌతులతో కూర్చుండెను.
59 ప్రధాన యాజకులును మహాసభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి, 60 అనేకమంది అబద్ధసాక్షులు ముందుకు వచ్చినను, వారికి ఏమియు దొరకలేదు. కడకు ఇద్దరు ముందుకు వచ్చి, 61 "'నేను మన తండ్రి ఆలయమును పడగొట్టి మూడు దినములలో దానిని తిరిగి కట్టగలను' అని ఈ మనుష్యుడు చెప్పెను" అనిరి.
62 అప్పుడు ప్రధానయాజకుడు లేచి ఆయనతో, "నీవు చెప్పుటకు ఏమియు లేదా? వీరు నీకు విరోధముగా సాక్ష్యమిచ్చునది ఏమిటి?" అనెను. 63 అయితే యేసు మౌనముగా ఉండెను. అప్పుడు ప్రధానయాజకుడు ఆయనతో, "సజీవుడైన తండ్రి తోడని నీకు ఆనబెట్టుచున్నాను, నీవు మన తండ్రి కుమారుడవైన క్రీస్తువో కావో మాకు చెప్పుము" అనెను.
64 యేసు అతనితో, "నీవే అంటివి. అయితే నేను మీతో చెప్పుచున్నాను, ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘములమీద వచ్చుటయు మీరు చూచెదరు" అనెను.
65 అప్పుడు ప్రధానయాజకుడు తన వస్త్రములు చించుకొని, "ఇతడు దేవదూషణ చేసెను! మనకు ఇకను సాక్షులతో పనియేమి? ఇదిగో, ఇప్పుడే ఈ దేవదూషణ మీరు వింటిరి. 66 మీ తీర్పు ఏమిటి?" అని అడిగెను. అందుకు వారు, "ఇతడు మరణమునకు పాత్రుడు" అనిరి.
67 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను చెంపదెబ్బలు కొట్టి, 68 "క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో మాకు ప్రవచింపుము!" అనిరి.
యేసును ఎరుగనని పేతురు చెప్పుట
69 పేతురు వెలుపల ఆవరణములో కూర్చుండియుండగా, ఒక పనికత్తె అతనియొద్దకు వచ్చి, "నీవును గలిలయుడైన యేసుతోకూడ ఉంటివి" అనెను.
70 అయితే అతడు అందరి యెదుట దానిని నిరాకరించి, "నీవు చెప్పునది నాకు తెలియదు" అనెను.
71 అతడు వాకిటిలోనికి వెళ్లగా, మరియొక పనికత్తె అతనిని చూచి, అక్కడ ఉన్నవారితో, "ఇతడు నజరేయుడైన యేసుతోకూడ ఉండెను" అనెను.
72 అతడు మరల ఒట్టుపెట్టుకొని, "ఆ మనుష్యుని నేనెరుగను" అని నిరాకరించెను.
73 కొంతసేపైన తరువాత అక్కడ నిలుచున్నవారు వచ్చి పేతురుతో, "నిశ్చయముగా నీవును వారిలో ఒకడవే, నీ పలుకుబడి నిన్ను బయలుపరచుచున్నది" అనిరి.
74 అప్పుడు అతడు, "ఆ మనుష్యుని నేనెరుగను" అని తనమీద శాపములు తెచ్చుకొనుచు ఒట్టుపెట్టుకొనసాగెను. వెంటనే కోడి కూసెను.
75 అప్పుడు, "కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు" అని యేసు చెప్పిన మాట పేతురు జ్ఞాపకము చేసికొని, వెలుపలికి పోయి సంతాపముతో ఏడ్చెను.