తండ్రి ఆశ్రయ పట్టణాలను ఏర్పాటు చేయుట
20 1 అప్పుడు మన తండ్రి యెహోషువతో ఇలా చెప్పాడు:
2 "ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: మోషే ద్వారా నేను మీతో చెప్పిన ఆశ్రయ పట్టణాలను మీ కోసం ప్రత్యేకపరచండి, 3 తెలియక, ఉద్దేశపూర్వకము కాకుండా ఒకరిని చంపినవాడు అక్కడికి పారిపోవచ్చు. అవి రక్తప్రతికారి నుండి మీకు ఆశ్రయముగా ఉంటాయి. 4 ఒకడు ఈ పట్టణాలలో ఒకదానికి పారిపోయినప్పుడు, అతడు పట్టణ ద్వారము ప్రవేశములో నిలబడి, ఆ పట్టణపు పెద్దల వినికిడిలో తన సంగతిని వివరించాలి. అప్పుడు వారు అతణ్ణి పట్టణములోనికి తీసుకొని, అతనికి ఒక స్థలమిచ్చి, తమ మధ్య నివసించనివ్వాలి. 5 రక్తప్రతికారి అతణ్ణి వెంబడించినప్పుడు, చావుకు కారణమైనవాణ్ణి వారు అతని చేతికి అప్పగించకూడదు, ఎందుకంటే అతడు తన పొరుగువాణ్ణి ఉద్దేశపూర్వకము కాకుండా కొట్టాడు, అంతకుముందు అతనిని ద్వేషించలేదు. 6 అతడు సభ ఎదుట విచారణకు నిలబడేవరకు, ఆ దినములలో సేవచేయు ప్రధాన యాజకుని మరణమువరకు ఆ పట్టణములో ఉండాలి. అప్పుడు చావుకు కారణమైనవాడు తాను పారిపోయి వచ్చిన పట్టణమునకు, తన సొంత ఊరికి, తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.
7 కాబట్టి వారు నఫ్తాలి మన్య దేశములోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిము మన్య దేశములోని షెకెమును, యూదా మన్య దేశములోని కిర్యత్‌అర్బాను (అదే హెబ్రోను) ప్రత్యేకపరచారు. 8 మరియు యొర్దాను అవతల, యెరికోకు తూర్పున, వారు రూబేను గోత్రములోనుండి అరణ్యములోని మైదానప్రాంతమందున్న బెజెరును, గాదు గోత్రములోనుండి గిలాదులోని రామోతును, మనష్షే గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించారు. 9 తెలియక ఒకరిని చంపినవాడు అక్కడికి పారిపోయి, సభ ఎదుట విచారణకు నిలబడకముందు రక్తప్రతికారి చేతిలో చావకుండునట్లు, ఇశ్రాయేలీయులందరి కోసమూ, వారి మధ్య నివసించు పరదేశి కోసమూ నియమించబడిన పట్టణాలు ఇవే.