యోషీయా మన తండ్రి యెదుట నీతిగా నడుచుకొనుట
ఆలయ మరమ్మతుల సమయములో ప్రధాన యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటాడు; అది బిగ్గరగా చదివి వినిపించబడినప్పుడు యోషీయా తన వస్త్రాలు చింపుకుంటాడు. అతడు ప్రవక్త్రియైన హుల్దా దగ్గరకు పంపుతాడు. మన తండ్రి పంపే విపత్తు రాబోతున్నదని ఆమె ధృవీకరిస్తుంది, అయితే అతని హృదయము మెత్తనిది కాబట్టి అతడు ముందుగానే సమాధి చేయబడతాడని చెప్తుంది.
22 1యోషీయా రాజైనప్పుడు ఎనిమిదేండ్లవాడు; అతడు యెరూషలేములో ముప్పదియొక్క సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడైన అదాయా కుమార్తె యెదీదా. 2అతడు మన తండ్రి దృష్టికి నీతిగా నడుచుకొనెను; తన తండ్రియైన దావీదు మార్గములన్నిటిలో నడుచుకొని కుడికిగాని ఎడమకుగాని తొలగలేదు.
3రాజైన యోషీయా తన పదునెనిమిదవ సంవత్సరమందు మెషుల్లాము కుమారుడైన అజల్యా కుమారుడును లేఖికుడునైన షాఫానును మన తండ్రి మందిరమునకు పంపి యీలాగు ఆజ్ఞాపించెను: 4ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వెళ్లి, ద్వారపాలకులు ప్రజలయొద్ద పోగుచేసి మన తండ్రి మందిరములోనికి తీసికొనివచ్చిన ద్రవ్యమును లెక్కపెట్టుమని అతనితో చెప్పుము. 5మన తండ్రి మందిరముపైన నియమింపబడిన పనివారి పైవిచారణకర్తలకు దాని అప్పగించి, మన తండ్రి మందిరమునకు కలిగిన నష్టమును బాగుచేయు పనివారికి వారు దానిని చెల్లించునట్లు చేయుము. 6వడ్లవారికిని, శిల్పకారులకును, తాపీవారికిని, మరియు మందిరమును బాగుచేయుటకు మ్రానులను చెక్కబడిన రాళ్లను కొనుటకును దానిని ఇయ్యవలెను. 7వారు నమ్మకముగా నడుచుకొనుచున్నారు గనుక వారి చేతికి అప్పగింపబడిన ద్రవ్యమునుగూర్చి లెక్క అడుగవలసిన అవసరము లేదు.
ధర్మశాస్త్ర గ్రంథము దొరకుట
8ప్రధాన యాజకుడైన హిల్కీయా లేఖికుడైన షాఫానుతో, "మన తండ్రి మందిరములో ధర్మశాస్త్ర గ్రంథమును నేను కనుగొంటిని" అని చెప్పి, ఆ గ్రంథమును షాఫానుకు ఇచ్చెను; అతడు దాని చదివెను. 9లేఖికుడైన షాఫాను రాజునొద్దకు వచ్చి, "మీ సేవకులు మందిరములో దొరకిన ద్రవ్యమును కుమ్మరించి, మన తండ్రి మందిరమందు పనివారికిని పైవిచారణకర్తలకును దాని అప్పగించిరి" అని చెప్పెను. 10లేఖికుడైన షాఫాను రాజుతో, "యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథమును ఇచ్చెను" అని చెప్పి, రాజు ఎదుట దాని బిగ్గరగా చదివెను.
11ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలను రాజు వినినప్పుడు అతడు తన వస్త్రములను చింపుకొనెను. 12రాజు యాజకుడైన హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకామునకును, మీకాయా కుమారుడైన అక్బోరునకును, లేఖికుడైన షాఫానునకును, రాజసేవకుడైన అశాయాకును ఈలాగు ఆజ్ఞాపించెను: 13"మీరు వెళ్లి, దొరకిన యీ గ్రంథములోని మాటలనుగూర్చి నా నిమిత్తమును, ప్రజల నిమిత్తమును, యూదా వారందరి నిమిత్తమును మన తండ్రిని అడుగుడి; ఏలయనగా మనగూర్చి వ్రాయబడిన సమస్తము చొప్పున చేయకుండ మన పితరులు యీ గ్రంథ మాటలను పాటింపనందున, మన తండ్రి కోపము మనమీద మండుచున్నది; అది గొప్పది."
14కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అశాయాయును యెరూషలేములోని రెండవ భాగమందు నివసించుచున్న ప్రవక్త్రియైన హుల్దా యొద్దకు వెళ్లిరి; ఆమె వస్త్రశాలకు కాపరియైన హర్హషు కుమారుడైన తిక్వా కుమారుడైన షల్లూము భార్య; వారు ఆమెతో మాటలాడిరి.
15ఆమె వారితో ఇట్లనెను: "ఇశ్రాయేలీయుల దేవుడైన మన తండ్రి సెలవిచ్చునదేమనగా: మిమ్మును నాయొద్దకు పంపిన మనుష్యునితో చెప్పుడి: 16మన తండ్రి సెలవిచ్చునదేమనగా: యూదా రాజు చదివిన గ్రంథములోని మాటలన్నిటి చొప్పున, నేను ఈ స్థలముమీదికిని దాని నివాసులమీదికిని కీడు రప్పింపబోవుచున్నాను. 17వారు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులన్నిటిచేత నాకు కోపము పుట్టించిరి గనుక, నా కోపము ఈ స్థలముమీద మండును, అది చల్లారదు.
18మీరు మన తండ్రిని అడుగుటకు మిమ్మును పంపిన యూదా రాజుతో ఈలాగు చెప్పుడి: నీవు వినిన మాటలనుగూర్చి ఇశ్రాయేలీయుల దేవుడైన మన తండ్రి సెలవిచ్చునదేమనగా:
19ఈ స్థలమునకును దాని నివాసులకును విరోధముగా—వారు పాడైపోయి శాపగ్రస్థులగుదురని—నేను చెప్పినదానిని నీవు వినినప్పుడు, నీ హృదయము మెత్తబడి తండ్రి యెదుట నిన్ను నీవు తగ్గించుకొని, నీ వస్త్రములను చింపుకొని నా యెదుట ఏడ్చితివి గనుక, నేను కూడ నీ మనవి వింటినని తండ్రి సెలవిచ్చుచున్నాడు. 20కాబట్టి నేను నిన్ను నీ పితరులయొద్దకు చేర్చుదును; నీవు సమాధానముతో నీ సమాధిలో చేర్చబడుదువు; నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడంతటిని నీ కన్నులు చూడవు." అప్పుడు వారు ఆమె జవాబును రాజునొద్దకు తిరిగి తీసికొనివచ్చిరి.