4 1 ఇప్పుడు పరిశుద్ధాత్మ స్పష్టముగా చెబుతున్నదేమనగా, అంత్యదినములలో కొందరు మోసపరచు ఆత్మలను, దయ్యముల బోధలను అనుసరించి విశ్వాసమునుండి తొలగిపోవుదురు, 2 అబద్ధికుల వేషధారణ ద్వారా వారి స్వంత మనస్సాక్షి వాత వేయబడిన ఇనుముతో కాల్చబడినట్లు మొద్దుబారిపోయినది. 3 వారు పెళ్లి చేసుకోవద్దని జనులను నిషేధించి, విశ్వసించి సత్యమును ఎరిగినవారు కృతజ్ఞతతో స్వీకరించుటకు మన తండ్రి సృష్టించిన ఆహారములను విసర్జించమని ఆజ్ఞాపించుదురు. 4 ఎందుకనగా మన తండ్రి సృష్టించినదంతయు మంచిది, కృతజ్ఞతతో స్వీకరించినయెడల దేనిని విసర్జింపకూడదు, 5 ఏలయనగా మన తండ్రి వాక్యము వలనను ప్రార్థన వలనను అది పరిశుద్ధపరచబడును.
6 ఈ సంగతులను నీవు సహోదర సహోదరీలకు జ్ఞాపకము చేసినయెడల, నీవు అనుసరించిన విశ్వాస వాక్యములతోను మంచి బోధతోను పోషింపబడుచు, క్రీస్తుయేసుకు మంచి సేవకుడవై యుందువు. 7 భక్తిహీనమైన, వ్యర్థమైన కల్పనాకథలతో నీకేమియు సంబంధము వద్దు. అంతకంటె భక్తిగలవాడవగుటకు నిన్ను నీవు అభ్యాసపరచుకొనుము. 8 శరీర సంబంధమైన అభ్యాసము కొంతమట్టుకు ప్రయోజనకరమే గాని, భక్తి అన్నిటికి ప్రయోజనకరమైనది — అది ఇప్పటి జీవితమునకును రాబోవు జీవితమునకును వాగ్దానము కలిగియున్నది. 9 ఇది నమ్మదగినదియు, సంపూర్ణముగా అంగీకరించదగినదియునైన మాట. 10 ఇందుకొరకే మనము కష్టపడి పోరాడుచున్నాము: సకల మనుష్యులకును, విశేషముగా విశ్వసించువారికిని రక్షకుడైయున్న సజీవుడగు తండ్రిమీద మన నిరీక్షణ ఉంచియున్నాము. 11 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము.
12 నీవు యౌవనుడవని ఎవరును నిన్ను తృణీకరింపనియ్యకుము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13 నేను వచ్చువరకు లేఖనమును బహిరంగముగా చదువుటకును, ప్రకటించుటకును, బోధించుటకును నిన్ను నీవు అప్పగించుకొనుము. 14 పెద్దలు నీమీద చేతులుంచినప్పుడు ప్రవచనము ద్వారా నీకు అనుగ్రహింపబడి, నీలోనున్న వరమును నిర్లక్ష్యము చేయకుము. 15 ఈ సంగతులను అభ్యసించి, వాటికి నిన్ను నీవు సంపూర్ణముగా అప్పగించుకొనుము, తద్వారా నీ అభివృద్ధి అందరికి కనబడును. 16 నీ ప్రవర్తనను నీ బోధను జాగ్రత్తగా గమనించుకొనుము. వాటిలో నిలకడగా ఉండుము, ఏలయనగా నీవు అట్లు చేసినయెడల నిన్నును నీ మాట వినువారిని కూడ రక్షించుకొందువు.